– ఆటో కార్మికుల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
సూర్యాపేట, ఆగస్టు 21 : ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న నిర్వహించనున్న ఆటో కార్మికుల బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆటో డ్రైవర్లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈ-ఆటోలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఆటో రవాణారంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను పెంచాలన్నారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం స్వయంగా ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
అక్రమంగా యాప్‌ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాలను నియంత్రించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, ప్రజలకు నిత్యం రవాణా సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ఈ-చలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. జీవో నంబర్ 263లో పేర్కొన్న మిగిలిన ఆటోలను వెంటనే అందించాలని, హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి అక్రమంగా నడుస్తున్న ఆటోలను నియంత్రించాల న్నారు. వాహన సారథి ద్వారా ఆటో డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కొనసాగించాలని, రవాణా వాహనాలకు రేడియం స్టిక్కర్ల విషయంలో జీవో ఎంఎస్ నంబర్ 60 ప్రకారం ఆటోలకు మినహాయింపు ఇవ్వాలని, గిగ్ ప్లాట్‌ఫామ్, యాప్ ఆధారిత సోషల్ సెక్యూరిటీ బోర్డులో ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.
ఆటో కార్మికులకు ప్రమాద బీమా కొనసాగించడంతో పాటు సాధారణ మరణాలకు కూడా బీమా వర్తింపజేయాలని కోరారు. 50 సంవత్సరాలు పూర్తయిన ఆటో కార్మికులకు పెన్షన్ అందించాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్టీయూ యూనియన్ అధ్యక్షుడు కుర్రి సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, మట్టయ్య, నరేశ్, సొందు, వేణు, రాజు, వెంకన్న, మాంగళ్య వెంకన్న, అనాసపురం యూసుఫ్, రమేశ్ పాల్గొన్నారు.