నల్లగొండ రూరల్, జూన్ 05 : నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ఘనంగా ముగిశాయి. సుమారు 35 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా క్రీడాధికారి కుంభం నర్సిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి శిబిరాల్లో 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయం అన్నారు. పేద విద్యార్థులకి కూడా నైపుణ్యాలు, ఆటలపై మెలకువలు అందించడం అభినందనీయమన్నారు. పిల్లల్లోని ప్రతిభను మెరుగుపరచే దిశగా క్రీడల శాఖ చేసిన కృషి ప్రశంసనీయమైనదని తెలిపారు. నల్లగొండ జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా విద్యార్థులు తమ ప్రతిభను చాటిచెప్పాలన్నారు.
జిల్లా క్రీడాధికారి కుంభం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అర్బన్ ప్రాంతాల్లో 17 కరాటే శిబిరాలు, 2 టైక్వాండో, 1 యోగా, ఫూట్ బాల్ 2 శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిక్షణ శిబిరాలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. విద్యార్థుల క్రీడా ప్రదర్శన ఎంతో మెరుగుపడిందని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు తన సొంత డబ్బులతో ప్రోటీన్ ఫుడ్ అందించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో క్రీడా ప్రమాణాలను మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ విమల, కరాటే కోచ్లు నాగార్జున, నాగేశ్, శ్రీధర్, పవన్, శ్రీనివాసులు, సైదులు, టైక్వాండో కోచ్లు అంబటి ప్రణీత్, ప్రేమ్, లోకేశ్, ఫుట్బాల్ కోచ్లు లింగయ్య, సునీత, దాస్, యోగా టీచర్ నాగార్జున, సిబ్బంది ప్రకాశ్ నారాయణ, నజీరుద్దీన్ పాల్గొన్నారు.
Nalgonda Rural : వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలకు నాంది : డీఈఓ భిక్షపతి
Nalgonda Rural : వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలకు నాంది : డీఈఓ భిక్షపతి