రామగిరి, జూలై 31: ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా అన్నెపర్తి సులోచన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఆ స్థానంలో ఇక్కడ పనిచేసిన కె.మహేందర్‌కుమార్ పదవి విరమణ పొందడంతో ఖమ్మంలో ఏసీగా విధులు నిర్వహిస్తున్న సులోచనను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయం అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు.
సులోచన గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏసీగా సుదీర్ఘకాలం పని చేశారు. ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగుట్ట పార్వతీ జడలరామలింగేశ్వరస్వామి దేవస్ధానం ఈఓగా పని చేస్తుండగా ఖమ్మం జిల్లాకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. తిరిగి సాధారణ బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లాకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల అభివృద్దికి, అర్చక, ఉద్యోగుల అభ్యున్నతికి సహకారం అందిస్తానని ఆమె తెలిపారు.