కట్టంగూర్, జూలై 12 : కట్టంగూర్ మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్‌లో ప్రతి శనివారం జరిగే వారసంతకు సరుకుల కోసం మహిళలతో పాటు, వివిధ పనులపై వందలాది ప్రజలు, ప్రయాణికులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. కాగా మండల కేంద్రంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
సరుకుల కోసం వచ్చే మహిళలతో పాటు వ్యాపారస్తులు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. సంతలో కొట్టుపెట్టుకునే వీధి వ్యాపారుల నుంచి తైబజారు(పన్ను) వసూలు చేస్తున్నారే తప్పా సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.