నల్లగొండ, నవంబర్ 18 : రాష్ట్రంలో 54శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల పాలకులు కరుణ చూపడం లేదని, ఫలితంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ బీసీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని పలు బీసీ సంఘాల నేతలు, ప్రతినిధులు బీసీ కమిషన్ ముందు విన్నవించారు. రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశోధించడానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ సంఘాల ప్రతినిధులతో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అధ్యక్షతన బహిరంగ విచారణ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి బీసీ కులాలకు సంబంధించిన వారు బీసీ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, విద్య, ఉద్యోగాలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం, వెల్ఫేర్ ద్వారా అరకొర వసతులపై రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు కమిషన్ ముందు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
బీసీలపై చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన..
రాష్ట్ర జనాబాలో బీసీలే సింహ భాగం ఉన్నప్పటికీ ఆది నుంచి పాలకులు చిన్నచూపు చూస్తున్నారని పలువురు నేతలు కమిషన్ ముందు వాపోయారు. ప్రధానంగా బీసీల్లో ఆర్థిక పరిపుష్టిలేక వెనుకబడి పోతున్నారని..ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాక్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు రావడం లేదని, వెల్ఫేర్ ద్వారా కావాల్సిన సాయం లేదని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లో వెనుకబడిన, తక్కువ సంఖ్యలో ఉన్న వాటి కులాల గుర్తింపు అనేదే లేదని, సంచార జాతుల గురించి పట్టించుకునే వారే లేరని, అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంచార జాతులు వేరే రాష్ర్టాల్లో ఎస్సీలుగా ఉంటే ఇక్కడ మాత్రం బీసీ ఏలో చేర్చారని.. అలాంటి వారిని ఎస్సీ కులంలో చేర్చాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన కొన్ని కులాలను బీసీ బీ, బీసీ డీలో కాకుండా బీసీ ఏలో చేర్చాలని మరికొన్ని కులాలు కమిషన్ను కోరాయి. బీసీలందరికీ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగం, చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ముక్తకంఠంగా అన్ని సంఘాలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చాయి.
ప్రతి ఒక్కరి ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
బీసీల జీవన విధానం, ఆర్థిక పరిపుష్టి, విద్యా విధానం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీసీలు తమ అభిప్రాయాలు తెలియచేయడంతోపాటు సాదకబాధకాలు చెప్పారని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని, ఆవేదనను రాత పూర్వకంగా తీసుకోవడంతో పాటు విన్నామని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీసీలపై అనవసరంగా అట్రాసిటీ కేసులు పెట్టిస్తే బీసీ కమిషన్ ఉపేక్షించబోదని, అలాంటి విషయాలు ఉంటే కమిషన్ దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు. ప్రధానంగా కొన్ని సంచార, వెనుకబడిన జాతుల వారు బీసీ ఏ నుంచి ఎస్సీ కులంలోకి మార్చాలని విన్నవించారని అన్నారు.
బీసీలు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో వివక్షకు గురవుతున్నారని, కుల వృత్తుల వారు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుల సర్వే జరుగుతున్నందున ఈ సర్వేలో బీసీలు అందరూ తప్పనిసరిగా పాల్గొని వివరాలు చెప్పాలన్నారు. ఈ సర్వే వల్ల బీసీల జనాభా ఎంతో తెలుస్తుందని..ఈ సర్వే తర్వాత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 65 నుంచి 70శాతం సర్వే పూర్తి కావడం శుభపరిణామమని, త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఎన్యుమరేటర్లను కోరారు. ఈ బహిరంగ విచారణలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హన్మంతరావు, తేజస్ నందలాల్ పవార్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులు అలీ, అనసూయ, యాదయ్య పాల్గొన్నారు.