నల్లగొండ, మార్చి 12 : వేసవిలో పశుగ్రాసం కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను ఈ ఏడాది కూడా పంపిణీ చేస్తున్నది. పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులను ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నది. ఒక మెట్రిక్ టన్ను గడ్డి విత్తనాలు మార్కెట్లో 438 రూపాయలు కాగా 75శాతం సబ్సిడీతో ఐదు కిలోల బ్యాగును 110 రూపాయలకే ఇస్తున్నది. తొలి విడుతగా నల్లగొండ జిల్లాకు 66.75 మెట్రిక్ టన్నుల విత్తనాలు రాగా వాటిని అన్ని మండల కేంద్రాల్లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో మరో 35 మెట్రిక్ టన్నులకు అధికారులు ఇండెంట్ పెట్టారు. గడ్డిని కోయడానికి చాప్ కట్టర్స్‌ను కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. 2 హెచ్‌పీ చాప్ కట్టర్‌ను రూ.8వేలకు, 5హెచ్‌పీని 10 వేలకు ఇస్తున్నది.
జిల్లాలో 5.12 లక్షల గోజాతి, గేదె జాతి పశువులు ఉన్నాయి. గడిచిన ఏడెనిమిది ఏండ్లుగా వానాకాలంతో పాటు యాసంగి సీజన్లోనూ సాగు నీటి కొరత లేకపోవడంతో ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో భూములు సాగవుతున్నందున ఎండు గడ్డికి కొరత లేదు. అయితే పశువులు పచ్చి గడ్డినే ఎక్కువగా వేసవిలో తినే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సబ్సిడీలో ఈ విత్తనాలు పంపిణీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే 66.75 మెట్రిక్ టన్నుల విత్తనాలను 75 శాతం సబ్సిడీతో అందచేసేలా చర్యలు చేపట్టింది. సీఎస్హెచ్-24తో పాటు ఎస్ఎస్జీ-898 రకం విత్తనాలు అందజేస్తుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13,200 మంది రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు. అయితే రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మరో 35 మెట్రిక్ టన్నుల విత్తనాలకు జిల్లా పశు సంవర్దక శాఖ యంత్రాంగం ఇండెంట్ పెట్టింది. నేడో రేపో అవి కూడా జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.
పచ్చి గడ్డితో పాలశాతం పెంపు
వేసవిలో పశువులు ఎక్కువగా పచ్చి గడ్డినే తింటాయి. ఎండు గడ్డి తిన్న పశువుల కంటే పచ్చి గడ్డి తిన్న పశువులు ఎక్కువ పాలు ఇవ్వడం సహజం. దాంతో రైతులు వేసవిలో పచ్చి గడ్డినే పశువులకు ఎక్కువగా పెడుతారు. రైతులు తమకున్న భూముల్లో కొంత భాగంలో పచ్చి గడ్డి విత్తనాలు చల్లి నీరు పెట్టి పెంచుతారు. దాన్ని విడుతల వారిగా కోసి పశువులకు వేస్తారు. అయితే ఒకసారి ఈ విత్తనాలు చల్లితే మూడు నాలుగుసార్లు కోసే అవకాశం ఉన్నందున వేసవి పూర్తి అయ్యే వరకు ఈ గ్రాసం పశువులకు ఉపయోగపడుతుంది.
మొక్క జొన్న, చాప్ కట్టర్స్ సైతం అందజేత
పచ్చిగడ్డి ఏపుగా పెరిగే అవకాశం ఉన్నందున దాన్ని సాధారణ కొడవల్లతో కోయడం ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ప్రభుత్వం చాప్ కట్టర్స్‌ను సైతం పశు సంవర్దక శాఖ ద్వారా సబ్సిడీతో అందజేస్తుంది. 2హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చాప్ కట్టర్స్‌కు రూ.8 వేల సబ్సిడీ ఇస్తుండగా 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చాప్ కట్టర్స్‌ను రూ.10 వేల సబ్సిడీతో అందజేస్తుంది. ఇప్పటి వరకు 65 మంది రైతులకు ఈ చాప్ కట్టర్స్‌ను ఇవ్వగా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇక ఆఫ్రికన్ టాల్వెంజ్ అనే వెరైటీకి చెందిన మొక్క జొన్న విత్తనాలను సైతం 75 శాతం సబ్సిడీతో ఇస్తూ ఇప్పటి వరకు రెండు మెట్రిక్ టన్నుల విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని పశుగ్రాసం కొరత రావొద్దని ప్రభుత్వం 75 శాతం సబ్సిడితో గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి యాదగిరి తెలిపారు. విత్తనాలు కావాలనుకునే పాడి రైతులు స్థానిక పశు సంవర్దక శాఖ కార్యాలయానికి వెళ్లి ఒక్కో బ్యాగు రూ.110 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. అలాగే సబ్సిడీలో మొక్కజొన్న విత్తనాలతో పాటు చాప్ కట్టర్స్ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.