తుంగతుర్తి, జనవరి 29 : తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఎంఈఓ బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి చదువుపై మరింత శ్రద్ధ పెరిగేలా ప్రోత్సహించి వారు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మార్గనిర్దేశం చేసే గొప్ప కార్యక్రమాన్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తలపెట్టిందన్నారు.
ఇందులో భాగంగా విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతిని ప్రోత్సాహకంగా అందివ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షలు, రెండవ స్థానం పొందిన వారికి రూ.3 లక్షలు, జిల్లా టాపర్ గా నిలిచిన వారికి రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి రూ.లక్ష బహుమతి, మండల స్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి రూ.10 వేల నగదు బహుమతిని అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ బందెల భరత్ కుమార్, తుంగతుర్తి మండల ఎగ్జిక్యూటివ్ గంట మహేందర్, తుంగతుర్తి డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల మంజుల సుధాకర్, సేల్స్ ఆఫీసర్స్ చిర్ర నరేష్, గోపగాని లింగమూర్తి, బింగి వెంకటేశ్వర్లు, పులుసు కల్పన సుధాకర్, పొదల వీరన్న, గుండ గాని లింగయ్య, తుంగతుర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.