ఆత్మకూర్.ఎస్, జూలై 16 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక అంశాలు, చదువు ప్రాముఖ్యత, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, ఆకర్షణలు, బాలికలకు ద్రుఢ సంకల్పం, మానసిక ధైర్యం, వేధింపులపై ఫిర్యాదు చేయడం, సమస్యలను ఉపాధ్యాయులకు తెలియజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఎలాంటి సందర్భాల్లోనైనా భయాందోళనకు గురి కాకుండా వేదింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బాలికలు, మహిళల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎంఈఓ దారాసింగ్, ఎస్ఐ శ్రీకాంత్, పాఠాశాల హెచ్ఎం సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.