హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేనేత పరిరక్షణ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో నేతన్నల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిషారానికి కృషిచేయాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వికలాంగుల పెన్షన్ను రూ. 6వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పెంపు ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. నిరుడు 44,49,767 మందికి పెన్షన్ రాగా, ప్రస్తుతం 42,80,129 మందికి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.