నీలగిరి, మార్చి12 : పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ మండల పరిధిలోని దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సత్ప్ర ప్రవర్తన కలిగి చెడును తుంచేసి మంచి మార్గం వైపు పయనించాలన్నారు.
నేటి టెక్నాలజీ ప్రపంచంలో చెడు అలవాట్లు తొందరగా ఆకర్షిస్తాయని వాటిభారిన పడి వ్యసనపరులు కాకుండా విద్యార్థి దశ నుంచే దూరంగా ఉండాలన్నారు. చదువే లక్ష్యంగా ఎంచుకుంటే గమ్యం చేరవచ్చని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ఐ సైదాబాబు, పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు చేతుల మీదుగా విద్యార్థులకు రివిజన్ మెటీరియల్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.