నిడమనూరు, జూలై 15 : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భా పాఠశాలలో భోజనం నాణ్యత, వంట గది పరిశుభ్రతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం బోధనేతర సిబ్బందితో సమావేశమై విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని హెచ్చరించారు. డ్యూటీ రిజిస్టర్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆమె వెంట ఎంఈఓ లావూరి వెంకన్న, కస్తూర్భా ప్రత్యేకాధికారి పద్మారాణి ఉన్నారు.