చివ్వెంల, మార్చి 10 : విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం అందించాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతులు, భోజనం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అదనంగా నిర్మించ నున్న 15 గదులకు రూ.2.30 కోట్లు మంజూరు కాగా వాటి నిర్మాణానికి స్థలం పరిశీలించారు.
అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విద్యాలయాలకు మహర్దశ వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఉన్నతమైన ఆలోచనలతో చదువాలని, తల్లిదండ్రులు కూడా వారికి ప్రోత్సాహకం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణ శాతం సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఆయన వెంట విద్యాశాఖ వెల్ఫేర్ ఏఈ ఓబులేశ్, జీసీఓ పూలమ్మ, ఎస్ఓ నాగలక్ష్మి ఉన్నారు.