చండూరు, జూన్ 20 : పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చండూరు మండల స్పెషల్ ఆఫీసర్ కె.నాగమల్లేశ్వర్ అన్నారు. శుక్రవారం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. గురుకుల పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా స్టోర్ రూంలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన బియ్యాన్ని త్వరగా వాడుకోవాలన్నారు. వంట గదిని, కూరగాయలను, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.యాదగిరి, గురుకుల పాఠశాల హెచ్ఎం రామకృష్ణ, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, గంగాధర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.వెంకటేశం, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.