కట్టంగూర్, నవంబర్ 15 : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నకిరేకల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని చిన్నపుల మహాత్మ జ్యోతీరావ్ పూలే గురుకుల బాలికల పాఠశాలలో శనివారం న్యాయసేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చదువు ద్వారానే మంచి భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. ప్రజలకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం మండల న్యాయసేవ సంస్ధను సంప్రదించాలని సూచించారు. నేడు సమాజంలో నేరాలు జరగడానికి ప్రజలకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు.
14 సంవత్సరాలు నిండని బాల బాలికలు ఎక్కడ పని చేయడానికి వీలులేదని, పని చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటర్ చట్టం ప్రకారం మైనర్లు వాహనాలు నడుపరాదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారిని ప్రణాళికయుతంగా చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రావు విద్యార్థినులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునుగోటి రవీందర్, ఏఎస్ఐ నాయని శ్రీనివాస్, న్యాయవాదులు సోమయ్య, వంగూరి వెంకన్న, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.