రామగిరి, మే 05 : నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పద్మనగర్లో గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మంగళవారం పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను అభినందించారు. అలాగే పాఠశాల దాత మిర్యాల యాదగిరి సోదరులను అభినందించారు. ఎల్లవేళలా పాఠశాలకు అందుబాటులో ఉంటూ పాఠశాలకు అవసరమైన సహకారం అందిస్తున్నందుకు అభినందించారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుచూ.. తమ తల్లిదండ్రులు మిర్యాల కమలమ్మ, వెంకటేశం పేరుతో ప్రభుత్వ పాఠశాలను పేద విద్యార్దులు చదువుకోవడానికి నిర్మించామని, అంతేకాకుండా ఎల్లవేళలా విద్యార్ధులకు ప్రోత్సాహకాలు ఇస్తూ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు.
అంతేకాకుండా విద్యార్ధులు భవిష్యత్లో ఉన్నత చదువులు చదవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పాఠశాల విద్యార్థులు సీహెచ్.జెస్సీ- 558, పి.స్వాతి- 543, సీహెచ్.గీతాంజలి-539, ఎస్.శ్రీహర్షిత-539, ఎస్.కారుణ్య-530, ఎన్.మణికంఠ-527, పి.శివ సాహితి-505, కె.పూజ-500 అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థుల అభినందన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఉష, జాతీయ యువజన పురస్కార గ్రహీత గంజి రాజేందర్, చెరిపెల్లి జయప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు అనిత, విజయ్ కుమార్, నరేశ్, సాఫియా, రాపోలు సుధర్మ పాల్గొన్నారు.