Saudi Arabia : సౌదీ అరేబియాతో అమెరికా చారిత్రక అణు ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీతో కుదిరిన అణు ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య 30 ఏళ్లపాటు అణు ఒప్పందం అమలులో ఉండనుంది. అయితే, ఈ అణు ఒప్పందం అణు బాంబు తయారీకి సంబంధించింది కాదు. అణు శుద్ధికి సంబంధించిది మాత్రమే. అంటే, సౌదీ అరేబియాలో యురేనియం శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అమెరికా, సౌదీ కలిపి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి.
ఇందుకోసం అమెరికా సంస్థలు సౌదీలో భారీగా పెట్టుబడులు పెడుతాయి. ఈ ఒప్పందం 30 ఏళ్ల వరకు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాల్ని ట్రంప్ ప్రభుత్వం అక్కడి కాంగ్రెస్ ముందు ఉంచబోతుంది. అక్కడ సమీక్ష అనంతరం ఈ ఒప్పందం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, వాళ్లు ఈ ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది సౌదీకి చాలా ఏళ్ల కల. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అణుబాంబు తయారు చేసే అవకాశం లేదు. యురేనియం శుద్ధి మాత్రమే చేస్తుంది. అయితే, గల్ఫ్ లాంటి ఇతర ప్రాంతాల్లో అణు కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే అమెరికా విధానం విషయంలో ఈ ఒప్పందం మారింది.
అయితే, ఇది అణ్వాయుధాల తయారీకి సంబంధించింది కాదు. పౌర అణు విద్యుత్ కోసమే. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే అణు విద్యుత్ వైపు అడుగులు వేస్తోంది సౌదీ. యురేనియం శుద్ధి చేయడం ద్వారా అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, అణు ఇంధన సరఫరా, టెక్నాలజీ బదిలీ వంటివి చేపడుతారు. ఈ పనిని మొత్తాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా అణు సాంకేతికతను అమెరికా.. సౌదీకి బదిలీ చేస్తుంది. యురేనియం శుద్ధి సాంకేతికతను మరింతగా వినియోగిస్తే అది అణ్వాయుధాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. అమెరికా పర్యవేక్షణ ఉండటం వల్ల సౌదీ ప్రభుత్వం అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం లేదు. పైగా అణ్వాయుధాలు తయారు చేయాలంటే మరింత సాంకేతికత అవసరం.
ప్రస్తుతం సౌదీ అరేబియా.. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)లో సభ్యత్వం కలిగి ఉంది. అంటే, దీని సభ్య దేశాల్లో అణుకార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. అవసరమైతే తనిఖీలు కూడా నిర్వహిస్తారు. అదే, అణుబాంబు తయారు చేయాలంటే దీన్నుంచి సౌదీ బయటకు రావాలి.