– విద్యలో రాణించి ఉత్తములుగా ఎదగాలి
– నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
రామగిరి, ఆగస్టు 30 : విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ చూపి జీవిత లక్ష్య సాధనకై ముందుకు సాగి ఉత్తములుగా స్థిరపడాలని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల్లగొండ పట్ణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జిల్లా అధికార సంస్థ ఆధ్వర్యంలో “న్యాయ అవగాహన సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత అంతా చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో మంచి మనుషులుగా ఎదగాలన్నారు. విద్యార్థులు ఎలాంటి నేరాలకు, వ్యసనాలను లోను కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒకసారి కేసు అయితే భవిష్యత్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఒక ఆశతో పిల్లల్ని చదిస్తుంటారని, వాళ్ల ఆశను నిలబెట్టే బాధ్యత విద్యార్థుల మీద ఉందన్నారు. ఇప్పుడంతా సెల్ ఫోన్స్ చూడడంలోనే గడిపేస్తున్నారని దాని వల్ల ఆయుష్షు తగ్గి కనుచూపు మందగిస్తుందనే విషయం తెలుసుకోవాలన్నారు.
అనంతరం జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి కె.దుర్గావ్రసాద్ మాట్లాడుతూ.. చట్టానికి సంబంధించిన విషయాలు సాధారణంగా బోర్ గానే ఉంటాయని, కాని దానితో పని పడినప్పుడు అవి ఇష్టంగా మారుతాయన్నారు. ప్రతి విద్యార్థి చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. జీవితంలో దవఖానాకు, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఉండేలా మనగలగాలన్నారు. అనంతరం విద్యార్థులు లక్ష్మీ బృందం, నర్మద ర్యాగింగ్, డ్రగ్స్ కు వ్యతిరేకంగా, గిరిజన హక్కుల కోసం పాడిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అండ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.పురుషోత్తం రావు, ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రు నాయక్, ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.పసుపులేటి మద్దిలేటి, బార్ అసోషియేషన్ అద్యక్షుడు కె.అనంత రెడ్డి, జన విజ్ఞాన వేదిక కందుకూరి సుదర్శన్, వైస్ ప్రిన్సిపాల్స్ డా.వి.రవి కుమార్, డా.అంతటి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి డా.వెల్దండి శ్రీధర్, ఎన్సీసీ ఆఫీసర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా.బి. అనిల్ కుమార్, వెంకటరెడ్డి, డా.ఏ.మల్లేశం, కోటయ్య, శివరాణి, సావిత్రి, అధ్యాపకులు డా.మునిస్వామి, డా.ఎం.అనిల్ కుమార్, కోర్టు సూపరింటెండెంట్లు రాంబాబు, స్వర్ణలత పాల్గొన్నారు.
Ramagiri : ‘విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’