చౌటుప్పల్ రూరల్, జూలై 14: అభం శుభం తెలియని ఓ గిరిజన విద్యార్థిని చదువుకునేందుకు వచ్చి గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి బలైంది. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట పరిధిలోని మహత్మా జ్యోతిరావు ఫూలే ట్రైబల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల పాఠశాలలో ఆదివారం రాత్రి ఐదో తరగతి చదువుతున్న విరబోయిన సంధ్య ప్రమాదవశాత్తు మృతి చెం దింది. గద్వాల జిల్లా మన్నేకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన విరబోయిన పరశురాం, జయమ్మ చిన్న కూతురైన సంధ్యను తల్లి జయమ్మ గత ఆదివారం గురుకుల పాఠశాల హాస్టల్లో దిగబెట్టి ఇంటికి వెళ్లింది. అయి తే హాస్టల్లోని నాలుగో అంతస్తుకు వెళ్లేందుకు గ్రిల్స్‌తో కూడిన గేటు ఉన్నది.
ఆ గేటును హాస్ట ల్ సిబ్బంది మూసివేయక పోవడంతో విద్యార్థిని సంధ్య పైకివెళ్లి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో పై నుంచి దూకడంతో తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతి చెందింది. అయితే హాస్టల్లో చేరే విద్యార్థులు కొత్తలో ఆ వాతావరణం లో ఇమడలేక అక్కడ ఉండేందుకు ఇష్టపడరు. అలాంటి వారి విషయంలో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులను సిబ్బంది పట్టించుకోక పోవడంతో పై అంతస్తు నుంచి దూకితే ప్రమాదమనే అవగాహన లేకపోవడంతో సంధ్య పై నుంచి దూకడంతో మృతి చెందింది. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సిబ్బంది గేట్లు మూసివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనకు సంబంధించి సిబ్బందిని, పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.
బాధ్యులపై చర్యలు చేపట్టాలి..
సంధ్య మృతికి కారకులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ,ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ విద్యార్థిని తల్లిదండ్రులకు తగిన న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏసీపీ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్, పోచంపల్లి నారాణపురం,రామ్మన్నపేటల నుంచి వచ్చిన పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.