రామన్నపేట, అక్టోబర్ 22 : రామన్నపేటలో అదానీ గ్రూపు ఏర్పాటు చేయాలని చూస్తున్న అంబుజా సిమెంట్ కర్మాగారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంగ బలం, అర్ధ బలంతో పరిశ్రమను తీసుకొచ్చి తమ నెత్తిన కాలుష్య కుంపటిని పెడుతామంటే ఊరుకునేది లేదని రామన్నపేట మండల ప్రజానీకం తేల్చి చెబుతున్నది. ఇక్కడి పర్యావరణాన్ని, జనజీవనాన్ని ఫణంగా పెట్టి కొర్పొరేట్కు రెడ్ కార్పెట్ వేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నది. ఈ మేరకు కొద్ది రోజుల నుంచి నిర్విరామంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామ గ్రామాన నిరసనలు వెల్లువెత్తాయి. పాఠశాల విద్యార్థులను నుంచి సబ్బండ వర్గాల ప్రజలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలో అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు ఏర్పాటు చేయగా, సమావేశానికి హాజరై ఫ్యాక్టరీ వద్దని చెప్పేందుకు మండలంలోని దాదాపు అన్ని గ్రామ ప్రజలు సిధ్ధమవుతున్నారు.
రామన్నపేట మండల రెవెన్యూ పరిధిలోని రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల భూమిని డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్ పేరుతో అదానీ కంపెనీ రైతుల నుంచి కొనుగోలు చేసింది. అందులో 66 ఎకరాల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, ఈ నెల 23న ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ప్రకటన వెలువడడంతో ప్రజలు భయాందోళనలో పడ్డారు. డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్కుతో రామన్నపేట మండలానికి మేలు జరుగుతుందని, యువకులు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సంతోషంగా ఉన్న ప్రజల్లో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న వార్త పిడుగులా పడింది. దాంతో ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే మూసీ కాలుష్య జలాలతో ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు.
పంటలు సరిగ్గా పండడం లేదు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామనడంతో రైతుల వెన్నులో వణుకు మొదలైంది. గీత, నేత, మత్స్యకారులతోపాటు వివిధ వృత్తిదారులు, యువకులు, విద్యార్థులు, అఖిల పక్ష నాయకులు పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. మెయిల్స్ పంపారు. అవగాహన సదస్సుల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించి చైతన్య పరిచారు. అదానీ కంపెనీ పొందుపరిచిన నివేదికలో 10 కిలో మీటర్ల మేర సిమెంట్ కంపెనీ ప్రభావం ఉంటుందని తెలుపడడంతో రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెం, నీర్నెంముల, లక్ష్మాపురం, బోగారం, నిదానపల్లి, తుమ్మలగూడెం, జనంపల్లి, ఇస్కిళ్ల, పల్లివాడ, ఉత్తటూరుతోపాటు చిట్యాల మండలంలోని చిట్యాల, పెద్దకాపర్తి, వెలిమినేడు, శివనేనిగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ముక్త కంఠంతో వ్యతిరేకించాలని అఖిల పక్షం పిలుపు
అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై జరిగే ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని అఖిల పక్షం నాయకులు పిలుపు నిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఒక్కటై కాలుష్య పరిశ్రమను అడ్డుకోవాలని కోరుతున్నారు. పరిశ్రమ ఏర్పాటు మూలంగా రామన్నపేట మండల ప్రజల భవిషత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. కన్న తల్లి వంటి పల్లెలను కాలుష్య కాసారం నుంచి కాపాడుకుందామంటున్నారు. మరోవైపు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ అఖిల పక్షం బుధవారం రామన్నపేట బంద్‌కు పిలుపునిచ్చారు. దాంతో వ్యాపారులు, విద్యాసంస్థలు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొని మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు
అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షామియానాలు, కుర్చీలు వేశారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలం చదును చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే ప్రజలు ఒకే మార్గంలో వచ్చి వెళ్లే విధంగా చేసి మిగతా రోడ్లను ట్రెంచ్ చేశారు. అవంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.