నల్లగొండ రూరల్, జూన్ 28 : కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు సొంతంగా ప్యాకింగ్ చేసి తమ బ్రాండ్‌గా విక్రయించరాదని, ఇలా చేయాలంటే తప్పకుండా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలని జిల్లా తూనికలు, కొలతల అధికారి పి.రామకృష్ణ సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కిరాణ షాపులపై ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం ఆయన దేవరకొండ మండలంలోని పలు కిరాణ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.1.80 లక్షల జరిమానా విధించి 9 మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కిరాణా దుకాణాల్లో ప్యాకేజీలపై మ్యానుఫ్యాక్చరింగ్, అడ్రస్, ఎమ్మార్పీ, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడాన్ని గుర్తించామన్నారు. దాంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దుకాణాల్లో డిక్లరేషన్ లేని ప్యాకేజీలు అమ్మరాదని, అటువంటివి తనిఖీల్లో దొరికినట్లయితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్యాకింగ్ చేసే వారు విధిగా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులు ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా లీగల్ మెట్రాలజీ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని, 9010651783 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.