నల్లగొండ అభివృద్ధికి ప్రణాళికలు
తుదిదశలో కళాభారతి, ఉదయ సముద్రం
మినీ ట్యాంక్ బండ్ నమూనాలు
4వేల మంది సామర్థ్యంతో కళాభారతి
బోటింగ్ స్పాట్‌గా వల్లభరావుచెరువు
పట్టణానికే హైలెట్‌గా క్లాక్‌టవర్ సెంటర్
చేర్పులుమార్పులపై ఎమ్మెల్యే కంచర్ల, కలెక్టర్ పీజే పాటిల్ సమీక్ష
నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదారుల విస్తరణ, ముఖ్య కూడళ్లు, పార్కుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నల్లగొండ కళాభారతి, పానగల్ ఉదయసముద్రం మినీ ట్యాంక్ బండ్ నమూనాల రూపకల్పన తుదిదశకు చేరుకున్నాయి. 4వేల మంది సామర్థ్యంతో కళాభారతి, ఆహ్లాదానికి కేరాఫ్‌గా మినీ ట్యాంక్‌బండ్‌ను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. వల్లభరావు చెరువును బోటింగ్ స్పాట్‌గా మార్చాలని నిర్ణయించారు.
క్లాక్‌టవర్ జంక్షన్‌ను పట్టణానికే హైలెట్‌గా తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ మేరకు నల్లగొండ కలెక్టరేట్లో కన్సల్టెన్సీ ఏజెన్సీలతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. మార్పులు చేర్పులపై చర్చించి సూచనలు ఇచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 9(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కేంద్ర అభివృద్ధిపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అదే రీతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా నల్లగొండను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు. దాంతో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నల్లగొండ కళాభారతి, పానగల్ ఉదయ సముద్రం ట్యాంకుబండ్‌ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి కూడా నల్లగొండలో పర్యటించి తగు సూచనలు చేశారు. ఆయన సూచనలతో వీటి అభివృద్ధికి ప్రత్యేక నమూనాలు రూపొందించే పనిని జెనిసిస్ కన్సల్టెంట్ కంపెనీకి అప్పజెప్పారు. ఆ కంపెనీ రూపొందించిన నమూనాలపై గురువారం కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక సమీక్షలో చర్చించారు. ఇంజినీర్లు, అధికారులు, కన్సల్టెంట్ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ రమణాచారి, చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్షించారు. సమీక్షలో కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నమూనాలపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఉదయ సముద్రం ట్యాంకుబండ్ ప్రదేశం ఆహ్లాదకరంగా, ఆనందాన్ని పంచేలా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు.
పర్యాటకంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానికంగా చారిత్రక దేవాలయాలైన పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు సైతం ఆధ్యాత్మికంగా మరింత శోభ సంతరించుకుంటాయన్నారు. పర్యాటకులతోపాటు భక్తుల సంఖ్య కూడా పెరుగనున్న నేపథ్యంలో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక హోటళ్లను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. స్థానిక సంప్రదాయ పద్ధతులు, ప్రజల అలవాట్లకు తగినట్లుగా ఆసక్తి కలిగే అంశాల ఆధారంగా నమూనాలు ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాభారతి నమూనాపై గూగుల్ మ్యాప్ ద్వారా కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలిస్తూ సమీక్షించారు. వీటిపై స్పందిస్తూ కళాభారతి నిర్మాణంలో మొత్తం 4వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఇందులో 2వేల మంది కూర్చునే ఆడిటోరియం, డైనింగ్ ఏరియా, ల్యాన్కు స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియం వెలుపల కూడా మరో 2వేల మంది కూర్చునేలా స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. అవసరమైతే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం, మెయిన్‌రోడ్డుకు ఆనుకుని బస్టాప్‌ను కూడా ఇందులో పొందుపర్చారని, రామగిరి వైపు మెయిన్ గేట్ రానున్నట్లు వివరించారు. వల్లభరావు చెరువును బోటింగ్ పాయింట్‌గా తీర్చిదిద్దుతామని, చెరువుకు అన్ని వైపులా పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ బెంచీలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. క్లాక్‌టవర్ సెంటర్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందని, వాటిపై ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం ఫైనల్ చేయాలని నిర్ణయించారు. గడియారం స్తూపం ఎత్తు, వెడల్పులపై ప్రత్యేకంగా చర్చించారు. అన్ని పనులను నిర్ణీత నమూనా ప్రకారం నాణ్యతగా, వేగంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.