సూర్యాపేట, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో గెలిచేది మనమే.. ఇంకా అక్కడక్కడా మిగిలిన పనులు పూర్తి చేసేది కూడా మనమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనం బీఆర్ఎస్ పార్టీనే నమ్ముతున్నారన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ కరెక్ట్ పార్టీ అని, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. బుధవారం సూర్యాపేట నియోకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
మ్యానిఫెస్టో అమలు చేయడం బీఆర్ఎస్ ప్రయారిటీ కాగా కాంగ్రెస్ ప్రయారిటీ వేరే ఉన్నదన్నారు. డబ్బులు ఎక్కడ వస్తాయి. ఎలా దండుకోవాలి అనేదే వారి తపన అన్నారు. ఇప్పటి వరకు మన ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విశ్వాసంతో 2018లో ప్రజలు రెండోసారి అధికారం కట్టబెట్టారని, తదనుగుణంగా గత ఐదేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినట్లు చెప్పారు. నేడు సూర్యాపేట నియోజక వర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోని టాప్ మూడు నియోజక వర్గాలతో పోటీ పడుతున్నదన్నారు. అందరూ ఆశించిన బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీలు నీటి మూటలు తప్ప మరోటి కాదని మంత్రి ఎద్దేవ చేశారు. ఇప్పటికే కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అక్కడ రోజురోజుకు ప్రజా ఆందోళనలు పెరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను వందకు వంద శాతం పూర్తి చేయడంతో పాటు ప్రజలు అడగనివి, ఎవరూ డిమాండ్ చేయని వాటిని అనేకం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇప్పటి వరకు ఎంతో చేసినం. చేయడానికి ఎక్కడ ఏం మిగిలింది? ఏం చేయాలి? అనేది మనకు మాత్రమే తెలుసని మళ్లీ మనమే గెలిచి అక్కడక్కడ మిగిలి ఉన్న పనులను పూర్తి చేసుకుందామన్నారు.
మ్యానిఫెస్టోను ఇంటింటికీ
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో బీఆర్ఎస్ పార్టీకి భగవధ్గీత లాంటిదన్నారు. అందుకే మ్యానిఫెస్టోకు అంతటి గౌరవం ఇచ్చి అందులో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా మనం ఇచ్చే హామీలనే నమ్మతారు తప్పా గతంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయనందున ఆ పార్టీని నమ్మరన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలించిన పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 30 శాతం కూడా అమలు చేసిన దాఖలాలు లేకపోగా పదేళ్లలో రెండుసార్లు మ్యానిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ మాత్రం వంద శాతం పూర్తి చేయడమే కాక, అదనంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు.
ఈసారి ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లేలా నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేస్తూ గతంలో చేసిన పనులు, మళ్లీ గెలిస్తే చేయబోయే పనులను వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.