రామగిరి, జనవరి 02: గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులు- స్వదేశీ మేళాల కార్యక్రమం ఈ నెల 30న నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 30న నిర్వహించే ‘రాష్ట్రస్థాయి సుస్ధిర విజ్ఞాన సదస్సు- స్వదేశీమేళ’ పోస్టర్లు ఆవిష్కరణ చేసి మాట్లాడారు. గతంలో నల్లగొండలో 5,500 మంది విద్యార్థుల బాల గాంధీ వేషధారణతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో సత్యం, అహింస సిద్ధాంతాల ఆధారంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుక వెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
ఈ సదస్సులో మహాత్మా గాంధీ జీవన తత్వాన్ని ప్రతిబింబించేలా గాంధీజీ విగ్రహాల సామూహిక ప్రదర్శన, చరకాల ప్రత్యక్ష ప్రదర్శన, సుస్థిర విద్య, సుస్థిర వైద్యం, సేంద్రీయ వ్యవసాయం, సహజ ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణ గ్రామీణ పరిశ్రమలు, సుస్థిర క్రీడలు, స్వదేశీ, స్వావ లంబన, స్వాభిమానం దిశగా ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పై అంశాలపై ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు ఎంవీ గోనారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ నీరుడు సంజీవరెడ్డి, ప్రతినిధులు కె.కరుణాకర్ రెడ్డి, బొమ్మపాల గిరిబాబు, కందిమళ నాగమణి, జి. జ్యోతి, పాముల అశోక్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎండి.అజీజ్, వై.రాధిక, ఎం.అరుణ, పి. శ్రీనివాస్ గౌడ్, టి.చిరంజీవి, వై.ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.