రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 25 : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంట గదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని అన్నింటిని పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. జైలులో సౌకర్యాలన్నీ పరిశీలించడం జరిగిందని, నిబంధనల ప్రకారం ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ముఖ్యంగా ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగున్నట్లు తెలిపారు. ఖైదీల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. నియమ నిబంధనల ప్రకారం జిల్లా జైలును బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు తదితర వివరాలను తెలియజేశారు. ఖైదీల సంక్షేమంలో భాగంగా వారి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జైలు సూపరింటెండెంట్ వెంట జిల్లా జైలర్ బాలకృష్ణ ఉన్నారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేశ్, డీఎస్పి శివరామిరెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న సేవలు, సంక్షేమ హాస్టళ్ల ద్వారా అందిస్తున్న సేవలు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
Justice Shameem Akhtar : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నల్లగొండ జిల్లా జైలు సందర్శన