బాన్సువాడ, జూలై 19: పట్టణంలోని వంద పడకల మాతాశిశు దవాఖానలో ఈ నెల 13న సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలో విచారణ కమిటీ సభ్యుడు టీఎస్ ఎంఐడీసీ ఈఈ నరేందర్ రెడ్డి ఆదివారం బాన్సువాడ దవాఖానను సందర్శించారు.
ఈ సందర్భంగా దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం హాస్పిటల్లో నీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకు, లేబర్ రూం, భవన నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ దవాఖానలోని సమస్యలను వివరించారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు విచారణ కమిటీ సభ్యుడు టీఎస్ ఎంఐడీసీ ఈఈ నరేందర్ రెడ్డి చెప్పారు. ఆయన వెంట టీఎస్ ఎంఐడీసీ ఏఈ సాగర్ రెడ్డి ఉన్నారు.