– విద్యా–పరిశోధనా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు
నల్లగొండ, సెప్టెంబర్ 05 : కష్టించే తత్వం, బోధన ఓ సామాజిక బాధ్యతగా, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా బోధన, పరిశోధన, సమాజ సేవలో నిరంతర కృషికి తగిన గౌరవంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.వై. ప్రశాంతికి 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కొడంగల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉన్నత విద్య అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. రామన్నపేటలో పాఠశాల విద్యను పూర్తి చేసిన డా.ప్రశాంతి, సూర్యాపేటలో త్రివేణి జూనియర్ కళాశాల విద్యను అభ్యసించారు. అనంతరం నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) లో పరిశోధనా అనుభవాన్ని పొందిన ఆమె, తైవాన్‌లో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనను పూర్తి చేసి, అనంతరం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆమె భర్త పుట్ట వెంకట రమణ రెడ్డి నల్లగొండలోని గౌతమీ విద్యా సంస్థల డైరెక్టర్‌గా విద్యా రంగంలో సేవలందిస్తున్నారు.

డా. వై. ప్రశాంతికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
డా. ప్రశాంతి విద్యా బోధనతో పాటు పరిశోధన రంగంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు, సదస్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలను ప్రచురిస్తున్నారు. అమెరికా , సింగపూర్ , ఇంగ్లాండ్ & టైవాన్ లో జరిగిన అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధన పత్రాలను సమర్పించారు. పరిశోధనలో కృషికి ఆమె పలు పురస్కారాలను అందుకున్నారు. డా వై ప్రశాంతి ఇప్పటివరకు ఏడు పుస్తకాలను రచించి, 10 వివిధ పాఠ్య పుస్తకాలలో అధ్యయనాలు అందించారు, 50 పరిశోధన పత్రాలు, 30కి పైగా జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు , 6 పేటెంట్లను కలిగి ఉన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడం, విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వారికి మెరుగైన ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించడం కోసం ఆమె నిరంతరం కృషి చేశారు.
ఆమె ఇప్పటివరకు సిడిసి కోఆర్డినేటర్, యూజీసీ కోఆర్డినేటర్, విభాగ అధిపతి, బీ ఓ ఎస్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్‌గా విశేష సేవలు అందించి ప్రస్తుతం డైరెక్టర్ అకడమిక్ ఆడిట్ అండ్ డిం సిడిసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారం వ్యక్తిగతంగా సంతృప్తిని, బాధ్యతను పెంచాయని, దేశ అభివృద్ధికి విద్యావంతులైన యువత తీర్చిదిద్దే సత్ సంకల్పానికి చక్కని ప్రోత్సాహంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఉప కులపతి కాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ అంజిరెడ్డి, తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

డా. వై. ప్రశాంతికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం