కేసీఆర్‌తోపాటు మరో ముగ్గురు సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర ప్రముఖులు ఖమ్మంలో ఒకే వేదికపైకి వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తున్నది. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వేలాదిగా తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులతోపాటు సాధారణ ప్రజలు సైతం సిద్ధ్దమయ్యారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రకారం సుమారు లక్షన్నర మందికి పైగా వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఉన్న సూర్యాపేట జిల్లా నుంచే లక్షా 20 వేల మంది, యాదాద్రి, నల్లగొండ జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతరులు కలిపి మరో 30వేల మంది వరకు తరలుతారని అంచనా. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వయంగా జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సూర్యాపేట, కోదాడ మార్గాల్లో సభకు వెళ్లే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. మరోవైపు రోజంతా ఖమ్మంలో హడావుడి ఉండనున్న నేపథ్యంలో ఖమ్మం వైపు వెళ్లే సాధారణ వాహనాలను విజయవాడ హైవే మీదుగా దారి మళ్లించనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు ముందుగా యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారి దర్శనం అనంతరం ఖమ్మం సభకు బయల్దేరనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి17(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన నల్లగొండ జనం మరో చారిత్రక సందర్భంలో కదం తొక్కేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్ధ పాలనకు చరమగీతం పాడే దిశగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆవిర్భవించిన బీఆర్ఎస్ వెంట నడిచేందుకు సై అంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఖమ్మంలో జరుగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగసభలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరికీ వారే స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ సానుభూతిపరులు, సీఎం కేసీఆర్ అభిమానులు, సామన్య ప్రజలు సైతం సభకు వెళ్లేందుకు సిద్ధం కాగా వారికి రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం పక్కనున్న సూర్యాపేట జిల్లా నుంచే భారీగా జనం సభకు తరలివెళ్లనున్నారు. జిల్లా పరిధిలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి సుమారు 1.20 లక్షల మందికి పైగా జనం సభకు హాజరుకానున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నియోజవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి గ్రామం నుంచి సభకు తరలివచ్చేందుకు జనం సిద్ధం కాగా వారి కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, డీసీఎం, టెంపో ట్రాక్స్‌లు, ఇతర వాహనాలను సమకూర్చారు. సొంత వాహనాలు ఉన్న వారు వాటిల్లోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లా నుంచి సూర్యాపేట, కోదాడ మీదుగా సభకు వెళ్లే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సభా స్థలికి నలువైపులా మొత్తం 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా అందులో పార్కింగ్-3ని సూర్యాపేట నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్-20ని కోదాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం కేటాయించారు.
నల్లగొండ, యాదాద్రి జిల్లాల నుంచి కూడా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులు సైతం స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా జిల్లాల నుంచి మరో 30 వేల మందికి పైగా సభలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ నేతల అంచనాలకు మించి సభకు అనూహ్య స్పందన లభిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం తొలి సభ కావడం, ఉత్తర దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరవుతుండడం, సీపీఎం, సీపీఐల అగ్రనేతలు పాల్గొంటుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయంగా ఆసక్తి కనబర్చే వామపక్ష శ్రేణులు కూడా సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వీరితో పాటు ఇతర రాజకీయ పక్షాల శ్రేణులు సైతం ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్న రాజకీయ వ్యూహంపైనా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా ఖమ్మం సభ దేశ రాజకీయ చరిత్రకు మేలిమలుపుగా నిలువనుందన్న చర్చ సర్వత్రా సాగుతుండడం విశేషం.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగసభ నేపథ్యంలో ఖమ్మం వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలను(సభకు వెళ్లే వాహనాలు మినహా) దారి మళ్లిస్తున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. సాధారణ, భారీ వాహనదారుల సైతం ఖమ్మం వైపు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట టౌన్ నుంచి ఖమ్మం కొత్త బైపాస్ రోడ్డు లేదా పాత రోడ్డు మీదుగా సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లాల్సిన వాహనాదారులు అటువైపు కాకుండా కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది. కోదాడ నుంచి ఖమ్మం వైపు వెళ్లాల్సిన సాధారణ వాహనదారులంతా కోదాడ నుంచి విజయవాడ జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సూర్యాపేట లేదా కోదాడ రూట్ల నుంచి ఖమ్మం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని, లేకపోతే విజయవాడ మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.