దేవరకొండ రూరల్, జూలై 31 : నల్లగొండ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన పోలగోని సృజన్ గౌడ్ సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖచే గుర్తించబడిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధ సంస్థగా నిర్వహించబడిన ఈ పోటీలు హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం, ఫణి విహార్ హైదరాబాద్ రోడ్డు, నల్లగొండలో జరిగాయి.
పోలగోని సైదులు, ప్రియాంక దంపతుల కుమారుడైన సృజన్ గౌడ్, జిల్లా స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఛాంపియన్షిప్లో విజేతలకు నల్లగొండ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సింహాద్రి, ఇతర ప్రముఖలు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.