సూర్యాపేట టౌన్, నవంబర్ 25 : క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని తోడ్పడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం అగర్తలలో జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థినిని మాస్టర్ ఇందిర ఎంపికైన సందర్భంగా చెస్ అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 17 సంవత్సరాల విభాగంలో జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన మాస్టర్ ఇందిరను ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించి నైపుణ్యం ఉన్న రంగంలో ప్రోత్సహించాలని పేర్కొన్నారు.