త్రిపురారం, మే 30 : గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలన్న ఉద్ధేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు అవి అలంకార ప్రాయంగా మారి కంప చెట్లు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో కనీస వసతులు లేక, కంపచెట్లతో విలవిల్లాడిపోతున్నాయి. త్రిపురారం మండలంలోని బొర్రాయిపాలెం క్రీడా ప్రాంగణం దుస్థితి ఇదే విధంగా ఉంది.
వీటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో వేసవికాలంలో యువత ఆటలు ఆడుకునేందుకు పొలాలను ఆశ్రయిస్తున్నారు. క్రీడా ప్రాంగణాలు అణువుగా లేకపోవడంతో యువత పొలం గట్లపైన ఆటలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఉన్న అన్ని క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రం చేసి యువత ఆటలాడుకునేందుకు వీలుగా వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. గ్రామాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగినందున క్రీడా ప్రాంగణాలు పరిశుభ్రం చేసి వాకింగ్ ట్రాక్, కబడ్డీ, లాంగ్‌జంప్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రజలు, యువత కోరుతున్నారు.