రామగిరి, జూన్ 14 : లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్ధలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయానికి లోక్ అదాలత్ దోహదం చేస్తుందన్నారు. జిల్లాలో 38 సివిల్, 15,837 క్రిమినల్, 85 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 28 బ్యాంక్ కేసులు, 25 సైబర్ క్రైమ్, 80 ట్రాన్స్కో, 5,567 ట్రాఫిక్ చాలన్ కేసులతో కలిసి మొత్తం 21,660 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు.
అదే విదంగా ప్రమాద బీమా కేసుల్లో రూ. 4,75,29,000 నష్ట పరిహారంగా ఇప్పించగా, రూ 30,21,000 బ్యాంక్ కేసుల్లో రుణ పరిహారం ఇప్పించారు. అదే విధంగా సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ డబ్బులు రూ.20,3,112 ఇప్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తమరావు, న్యాయమూర్తులు సంపూర్ణానంద్, రోజారమణి, దుర్గాప్రసాద్, కులకర్ణి, ప్రమీల జైన్, శీరిష, సౌందర్య, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల భీమార్జున్రెడ్డి, బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయవాదులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.