రామగిరి, ఏప్రిల్ 6 : నల్లగొండ నడిబొడ్డున బెంజ్.. ఆడీ.. వోల్వో వంటి లగ్జరీ కార్లు రయ్యురయ్యున చక్కర్లు కొట్టాయి. ఆరేడు లక్షల రూపాయల బైక్‌లు యువతను ఆకట్టుకున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మోడల్స్ నుంచి లక్షల విలువ జేసే లగ్జరీ వెహికల్స్ వరకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆటోషోలో కొలువుదీరాయి. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షో శనివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజులపాటు కొనసాగనున్న ఆటోషోకు పవన్ మోటార్స్ మెయిన్ స్పాన్సర్‌గా కొనసాగుతుండగా, మొత్తం 31 ప్రముఖ కంపెనీలు తమ కార్లు, ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచాయి. వినియోగదారులకు రుణ సదుపాయం కల్పిచేందుకు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏడీవీటీ జనరల్ మేనేజర్ నెమరుగొమ్ముల సురేందర్‌రావు, బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్‌రెడ్డి, ఏడీవీటీ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సిబ్బందితో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆటో షోలోని స్టాళ్లను కలియదిరిగారు.
ఈ సందర్భంగా ఆటో షో లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లోని కార్లు, బైక్‌లను ఆసక్తిగా పరిశీలించి, వాటి గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండలో ఇంతటి స్ధాయిలో ఆటో షో నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. నమస్తే తెలంగాణ ఏడీవీటీ జీఎం సురేందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఆటో షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒకే వేదికపైకి వివిధ కంపెనీల కార్లు, టూ వీలర్స్‌ను అందుబాటులోకి తేవడంతో సమయం కలిసి వస్తున్నదని, వాహనాలు కూడా మంచి డిస్కాంట్లో లభిస్తున్నాయని తెలిపారు. అంతకుముందు నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్ ప్రారంభోపన్యాసం చేస్తూ గతంలో వచ్చిన స్పందనతోనే రెండోసారి ఆటోషో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాది 24 కంపెనీలు వస్తే ఈసారి బెంజ్, వోల్వో వంటి కంపెనీలు సహా 31 కంపెనీలు భాగస్వామ్యం అయినట్లు తెలిపారు.
ఆటోషోకు నల్లగొండ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల వాళ్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆసక్తిగా వాహనాలను కొనుగోలు చేశారు. ఎన్జీ కాలేజ్ బీకామ్, బీబీఏ విద్యార్థులతోపాటు డీవీఎం కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా సందర్శించి ఫీల్డ్ విజిట్‌గా ఉపయోగించుకున్నారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ కార్పొరేట్ యాడ్స్ మేనేజర్ చరణ్, నల్లగొండ ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, ప్రొడక్షన్ ఇన్చార్జి ప్రవీణ్, కనగల్ జడ్పీటీసీ వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ నేత యామ దయాకర్, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటలకు ఆటోషో కొనసాగనున్నది.