– రోజుకు 12 డివిజన్ల చొప్పున నాలుగు విడతల్లో 48 డివిజన్లలో వార్డు సభలు
– నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, జూన్ 03 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేది నుండి 8వ తేది వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే ప్రత్యేక వార్డు సభలను జయప్రదం చేయాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర కోరారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సెక్షన్ హెచ్ఎఓడీలు, వార్డు అధికారులు, పర్యవేక్షణ అధికారులు, శానిటరీ జవాన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4వ తేది నుండి రోజుకు 12 డివిజన్ల చొప్పున నాలుగు రోజులపాటు 8వ తేది వరకు అన్ని వార్డుల్లో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డు అధికారి తనకు కేటాయించిన డివిజన్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, అమృత్ మిత్ర గ్రూపులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
వార్డు సభల ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్- 2020, నాలుగు రకాల చెత్త వేరు చేయడం, ఈ- వేస్ట్ నిర్వహణ, వర్షాకాల సన్నద్ధత, డ్రైనేజీల శుభ్రత, తాగునీటి సరఫరా, నీటి నిల్వల నివారణ, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు విసృత అవగాహన కల్పించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త మరియు ప్రత్యేక సంరక్షణ చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే రాబోయే వర్షాకాలంలో సంభవించే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజలను ముందస్తుగా చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నగర ప్రజలందరూ తమ తమ డివిజన్లలో నిర్వహించే వార్డు సభలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సహాయ -నగర ప్రణాళికాధికారి జె.కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఎం.ఆసిమ్ బాబా, టి.ప్రవీణ్, కార్యాలయ సిబ్బంది. వార్డు అధికారులు, పర్యవేక్షణ అధికారులు, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.

‘రేపటి నుండి జరిగే ప్రత్యేక వార్డు సభలను విజయవంతం చేయాలి’