యాదాద్రి భువనగిరి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా సర్కారు కార్యాలయాల్లో ఫైళ్లన్నీ కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. ఏ అధికారి చేతిలో చూసినా దస్ర్తాలే దర్శనమిస్తుంటాయి. పెద్ద సార్ల సంతకాల కోసం పత్రాలు పట్టుకొని చక్కె ర్లు కొడుతుంటారు. కలెక్టర్, జేసీలు, ఇతర ఉన్నతాధికారుల సంతకాల కోసం ఎప్పుడు సమయం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నం. అధికారుల ఫైళ్లతో పాటు వివిధ పనులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కలెక్టరేట్లో ఈ-ఆఫీసు, హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్, కోర్టు కేసులు మానిటరింగ్ ఆన్లైన్ ద్వారా చేపడుతున్నారు. త్వరలోనే ఏఐ అటెండ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ అనురాగ్ చొరవతో ఆన్లైన్ ద్వారా పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
సాధారణంగా కలెక్టరేట్లో ఏ పనిచేసినా నోటు ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు ఆమోదం తెలపాలి. ఇందు కోసం దస్ర్తాలు పట్టుకొని అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సమ యం కూడా వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఇటీవల కాలంలో ఈ -ఆఫీసు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ఫైల్ అయినా అంతా ఆన్లైన్లోనే క్లియర్ అవుతుంది. కింది స్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు అందరికీ డిజిటల్ కీ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఆఫీస్‌లోనే కాకుండా ఎక్కడున్నా ఫైళ్లు అప్రూవ్ చేయొచ్చు. దీని ద్వారా పారదర్శకత కూడా పెరుగుతుంది. ఫైల్ ఎక్కడుంది..? ఎవరి దగ్గర ఉంది..? ఎందుకు పెండింగ్‌లో ఉంది..? తదితర అంశాలు సులభంగా తెలుస్తాయి. అంతే కాకుండా ఫైల్ ఏ తేదీ..? ఎవరు అప్రూవల్ చేశారు..? తదితర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. దీంతో అధికారులంతా ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జిల్లాలోని హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చారు. దీని పేరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఎఫ్ఐఎంఎంఎస్). ఇది ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. జిల్లాలోని హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా అధికారులు మొదలుకొని.. తాసీల్దార్, ఎండీపీవోలు తదితరులను అపాయింట్ చేశారు. వీరంతా ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శించి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి. కానీ గతంలో అనేక మంది ప్రత్యేకాధికారులు ఫీల్డ్‌కు వెళ్లకున్నా వాస్తవ నివేదిక ఇవ్వకుండా.. నామా మాత్రంగా రిపోర్టు ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త యాప్‌తో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేక అధికారి కచ్చితంగా హాస్టల్‌ను సందర్శించి.. యాప్ నుంచే లైవ్ సెల్ఫీ ఫొటోతోపాటు అక్కడి పరిస్థితులు యాప్‌లో అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా నిర్ధిష్టమైన ఫార్మాట్లో 10 నుంచి 15 ప్రశ్నలు పూరించాల్సి ఉంటుంది. అవి నేరుగా సంబంధిత జిల్లా అధికారితోపాటు కలెక్టర్ లాగిన్‌కు వెళ్తాయి. సమస్య పరిష్కారం అయ్యిందా..? లేదా.. యాప్‌లో కనిపిస్తుంది. దీనిని కలెక్టర్ వారం వారం సమీక్షిస్తారు.

కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో మరిచిపోవడంతో అనేక సార్లు ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు నేరుగా హాజరు కావాలని న్యాయమూర్తలు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇక కోర్టు ఫైళ్లు ఎక్కడ ఉన్నాయి..? ఎప్పుడు హియరింగ్ ఉంది..? ఎప్పుడు ఫాలోఅప్ చేయాలి..? అనేవి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చారు. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేశారు. కోర్టు కేసులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు.
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళ్తారో..? ఎవరికీ తెలియని పరిస్థితి. కొందరు అధికారులు ఆఫీసుల్లోనే ఉండరు. కార్యాలయాల్లో సిబ్బంది అడిగితే.. సారు ఫీల్డ్‌కు వెళ్లారనే సమాధానం వినిపిస్తుంది. ఇక కొందరు అధికారులు, సిబ్బంది తీరిగ్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఆఫీసుకు వచ్చి.. 3 గంటల నుంచి 4 గంటల మధ్యే ఇంటి బాట పడతారు. ఇలాంటి వారి కోసం యాదాద్రిలో త్వరలోనే ఏఐ అటెండెన్స్ తీసుకొస్తున్నారు. వచ్చే నెల రెండో వారం లేదా మూడో వారంలో ఇది అందుబాటులోకి రానుంది. కెమెరాలకు ఏఐని అటాచ్ చేస్తారు. దీంతో అక్కడ పనిచేసే ప్రతి అధికారి, సిబ్బంది కదలికలు అందులో నిక్షిప్తమవుతాయి. నెల కాగానే వివరాలను క్రోడీకరిస్తారు. సమయపాలన పాటించని వారిని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కలెక్టరేట్లో ఫైళ్లన్నీ ఆన్లైన్ చేస్తున్నాం. హాస్టళ్లలో సమస్యలు, కోర్టు కేసుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జూన్ మధ్యలో ఏఐ అటెండెన్స్ తెస్తాం. జీహెచ్ఎంసీలో ఓ జోన్లో విజయవంతంగా అమలు చేశాం. రానున్న కాలంలో మరింత టెక్నాలజీని ఉపయోగిస్తాం. ఆన్లైన్ సేవల ద్వారా పాదర్శకత పెరుగుతుంది.