నకిరేకల్, ఆగస్టు 5: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) అన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలు కల్పించడంతోపాటు మాదకద్రవ్యాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 350 ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడ్డాయి. వీటిలో 120 ద్విచక్ర వాహనాలు,10 త్రీ చక్ర వాహనాల ఉన్నాయి. ఎనిమిది మంది అనుమానితులను గుర్తించారు. నల్లగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 50 మంది టీజీఎస్పీ సిబ్బందితో కలిపి మొత్తం 300 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. నేపాల్ నుంచి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక షెడ్లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు పట్టుబడ్డాయని, చట్టప్రకారం గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా18 మంది గంజాయి సేవించినట్లు గుర్తించామని, వారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాలనీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని, గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.
జిల్లాలో గంజాయిని అరికట్టడం కోసం మూడు దశల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.