సూర్యాపేటటౌన్, ఆగస్టు 31 : జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం, శోభాయాత్రకు పోలీసు శాఖ పటిష్ట భద్రత కల్పిస్తుందని జిల్లా ఎస్పీ కె.నర్సింహా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలోని పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జనం ఎక్కడ చేయాలనేది ముందుగా అవగాహన కల్పించాలన్నారు. స్థానిక రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
తాగునీటి చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని ఉత్సవ కమిటీలను కోరారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసుకోవడం మంచిదన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పాలేరు, సాగర్ కాల్వల్లో నిమజ్జనానికి అనుమతి లేదన్నారు. అధిక వర్షాల వల చెరువులు, కుంటలు, వాగులు నిండి ఉన్నాయని లోతైన నీరు ఉందని లోపలికి వెళ్లకుండా ఒడ్డున ఉండి నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళల్లో కూడా పర్యవేక్షణ కోసం స్పాట్ లైట్లు, శక్తి వంతమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలు నిమజ్జన ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిదన్నారు. మహిళలు నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున మహిళా పోలీసులను ప్రత్యేకంగా నియమించాలన్నారు.
మహిళలపట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రధాన నిమజ్జన ఘాట్ల వద్ద, శోభాయాత్ర మార్గంలో డ్రోన్ కెమరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సూచించారు. పోలీసు కంట్రోల్ రూమ్లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తామన్నారు. ఉత్సవాల పేరుతో మద్యం సేవించి హంగామా సృష్టించే వారిని వదిలిపెట్టబోమని అలాంటి వ్యక్తులపై బైండవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణపతి విగ్రహాలను తరలించే సమయంలో ఎక్కడైనా వేలాడే విద్యుత్ తీగలు ఉంటే ముందుగానే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు.