విత్తనం ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
పంట చేతికొచ్చే వరకూ బిల్లు భద్రం
భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి
వ్యవసాయశాఖ సూచనలు, సలహాలు
యాదాద్రి, జూన్ 19: వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులు తెలుసుకుని విత్తనాలు ఎంపిక చేసుకుంటే మేలు. తెలంగాణ సర్కారు సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన కొన్ని విత్తనాలను సొసైటీల ద్వారా పంపిణీ చేస్తున్నది.
తెలియని వ్యక్తుల వద్ద కొనొద్దు
పరిచయం లేనివారు, గతంలో ఎప్పుడూ విత్తనాలు అమ్మనివారి వద్ద విత్తనాల కొనుగోలు అంత మంచిది కాదు. కొందరు దళారులు అడ్డదారిన రైతులను సంప్రదించి బురిడీ కొట్టిస్తున్నారు. వారితో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గ్రామాలకు వచ్చి ఊరు, పేరు లేని కంపెనీల విత్తనాలను అంటగట్టే అవకాశం ఉంది. గుంటూరు, హైదరాబాద్ వెళ్లి కొందరు రసీదు లేకుండా అనుమతి లేని విత్తనాలు కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కొనుగోళ్ల వల్ల సాగు సమయంలో అనుకోని నష్టాలు వస్తే ఎవరినీ జవాబు దారీ చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఏఓ, ఏఈఓ సలహాలతోపాటు స్థానిక డీలర్ల వద్ద రసీదులు తీసుకొని కొనుగోలు చేయడం అత్యుత్తమం.
వర్షాలను అంచనా వేస్తూ వరి నాట్లు..
వర్షాలను అంచనా వేస్తూ వరి నాటు వేస్తే ప్రయోజనం. రైతులు నేల స్వభావం, వర్షపాతం ఆధారంగానే దీర్ఘకాలిక, స్వల్పకాలిక విత్తనాలను ఎంచుకోవాలి. జిల్లాలో ఈ నెలాఖరు వరకు సాంబమసూరి (బీపీటీ-5204), ఎంటీయూ 1061, డబ్ల్యూజీఎల్-44 రకాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చే నెల 20లోపు అయితే కృష్ణ (ఆర్ఎన్ఆర్-2458), వరంగల్ సన్నాలు
(డబ్ల్యూజీఎల్-32100), విజేత (ఎంటీయూ-384) రకాలు అనుకూలంగా ఉంటాయి. వర్షాలు ఆలస్యమైతే వచ్చే నెలాఖరు వరకు కాటన్ సన్నాలు (ఎంటీయూ1010), జగిత్యాల సన్నాలు (జేజీఎల్-1788) వంటి స్వల్పకాలిక విత్తనాలు విత్తుకోవచ్చు.
విడుతల వారీగా నత్రజని వాడకం
నత్రజని వాడకం ఎక్కువగా జరిగితే ఆకు బాగా పెరిగిపోయి, చీడ పీడలు ఆశించే అవకాశం ఉంది. పంటలకు కావాల్సినంత మోతాదులో నత్రజని వినియోగించాలి. వరి, పత్తి పంటలకు మూడు నుంచి నాలుగు సార్లు దఫాల వారీగా నత్రజనిని వినియోగించుకోవాలి.
మిరప.. నారు పోసుకోవడమే మేలు
మిరప పంటకు చాలా మంది రైతులు నర్సరీల నుంచి నారు తెచ్చుకుంటారు. ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. రైతే నమ్మకమైన విత్తనాలు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచుకుంటే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. నారు పోయడానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వర్షపు నీరు పారే విధంగా బెడ్లు వినియోగించాలి. ముందు జాగ్రత్తగా బెడ్లపై జీవ ఎరువులు వేయాలి. విత్తన శుద్ధి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొక్కల వయస్సు 40-45 రోజులు దాటాక నాటుకుంటే మేలు. ఒక్కో బెడ్ వెడల్పు మీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువగా ఉంటే కలుపు తీయడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. బెడ్ ఎత్తు కనీసం 20 నుంచి 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి.
వెదజల్లే పద్ధతి మేలు..
వరిలో రైతులు వెదజల్లే పద్ధతిని వినియోగించాలి. సాధారణ పద్ధతిలో ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనాలు అవసరం కాగా వెదజల్లే విధానం ద్వారా కేవలం 8 నుంచి 10 కేజీలు సరిపోతాయి. మన భూముల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల లభ్యం కానీ భాస్వరం నిలువలు ఎక్కువగా ఉన్నాయి. భాస్వరం లభ్యం కానీ నేలల్లో పంటకు భాస్వరం లభ్యమయ్యే విధంగా భాస్వరం కరిగే బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను వాడే విధంగా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను పెంచి 35 నుంచి 40 రోజులకు పూత దశకు వచ్చిన అనంతరం భూమిలో కలియదున్నడం వల్ల నత్రజని ఇతర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు నత్రజని, పాస్పరస్, పొటాషియం కూడా లభ్యమవుతాయి.
60 శాతం తేమ ఉంటేనే పత్తికి మేలు..
విస్తారంగా వర్షాలు కురిసిన తర్వాత భూమిలో కనీసం 60-70 శాతం తేమ ఉంటేనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. ఎర్ర, నల్లరేగడి భూములు మాత్రమే పత్తికి అనుకూలం. ఎర్రనేలల్లో 50-60 శాతం, నల్లరేగడి భూముల్లో 60-70 శాతం తేమ తప్పనిసరి. నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా సాగు చేస్తే త్వరగా పూత, కాపు వచ్చే హైబ్రిడ్ విత్తనాలను ఎంచుకోవాలి. నీటి వసతి ఉంటే ఆలస్యంగా పూత, కాపు వచ్చే రకాలు అనుకూలంగా ఉంటాయి. బీటీ రకంతో పూత, కాపు తొందరగా వచ్చే అవకాశం ఉంది. దీనిపై కాయ తొలిచే పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. దీంతో పూత, కాపు రెండూ నిలబడుతాయి. దీనిలో మొక్కలు భారీగా పెరుగడం, కొమ్మలు సాగే అవకాశం ఉన్నందున అచ్చు 40-42 అంగుళాలకు బదులుగా నేలను బట్టి 4×2 అడుగులు (ఎకరానికి 5,555 మొక్కలు) చొప్పున విత్తుకోవాలి. తద్వారా మంచి దిగుబడి సాధించే అవకాశం ఉన్నది.
అదును.. పదును చూసి అపరాల సాగు
ఈ ఏడాది జిల్లాలో అపరాల సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు కంది విత్తుకోవచ్చు. పత్తిలో అంతర పంటగా కంది సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా పీఆర్జీ 176, నిర్మల్, కావేరి సంపద రకం వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మినుములు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు విత్తుకోవచ్చు. పీయూ 11, 31 వంటి రకాలతో ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. పెసర సాగులో డబ్ల్యూబీజీ 41, ఎంజీజీ వంటి రకాలు ఉంటాయి.
విత్తన ఎంపికలో జాగ్రత్తలు అవసరం
అనుమతి ఉన్న విత్తనాలనే కొనాలి. కొనుగోలు రసీదులను భద్రపరుచుకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేసుకుంటే పెట్టుబడి తక్కువగా వస్తుంది.
– పద్మావతి, ఏడీఏ, యాదగిరిగుట్ట