భూదాన్ పోచంపల్లి, మే 28 : భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. కల్తీ పాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్ఐ భాసర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముక్తాపూర్ గ్రామానికి చెందిన సన్న ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేసి హైదరాబాద్‌లోని హోటళ్లు, వినియోగదారులకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం ఉదయం ప్రశాంత్ ఇంటిపై దాడి చేసి 60 లీటర్ల కల్తీ పాలు, 250 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 కిలోల డాల్ఫర్ సీమ్డ్ పాల పౌడర్‌ను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కల్తీ పాలను పరీక్షల నిమిత్తం లాబొరేటరీకి పంపించారు. నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భాసర్‌రెడ్డి తెలిపారు.