మోతె, జులై 02 : కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం నాగయ్యగూడెంలో బుధవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న (50). ఈయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. ముగ్గురికి పెండ్లిళ్లు అయ్యాయి. వెంకన్నకు 4 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఇందులో ఇద్దరు కొడుకులకు తలా ఎకరంన్నర రిజిస్ట్రేషన్ చేశాడు. కాగా మిగిలిన ఎకరం 29 గుంటల మీద వెంకన్నకు ఆయన పెద్ద కుమారుడు గంగయ్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో వెంకన్న బైక్పై మామిల్లగూడెం నుండి విభలాపురానికి వెళ్తుండగా గంగయ్య గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందినట్లు తెలిపారు. వెంకన్న భార్య గతంలోనే కాలం చేసింది. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.