సూర్యాపేట, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : లాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇటీవల పరీక్షలు రాయగా ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కొంతమంది అక్రమాలకు తెరలేపారు. ఈ ఉద్యోగానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్న వారికి 20 మార్కులు వెయిటేజీ కింద ఇవ్వనుండగా వాటి కోసం తప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో ఇదే అదునుగా బావించిన అధికారులు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు తీసుకొని తప్పుడు అనుభవం పత్రాలు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు జీవితలో స్థిరపడవచ్చని ఎంతో మంది నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. మరికొంతమంది ఉంటారు.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని వక్రమార్గాలను అన్వేషిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును కొట్టేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డీఎంఈ, వైద్య విధాన పరిషత్ నేతృత్వంలోని మెడికల్ కళాశాలలు, పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 1284 పోస్టులకు పరీక్ష నిర్వహించగా ఎంఎల్టీ, డీఎంఎల్టీ, డీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన అభ్యర్థులు 23,323 మంది హాజరయ్యారు. 80 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండగా, మరో 20 మార్కులను ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఆరు నెలలకు రెండు మార్కుల చొప్పున ఏడాదికి నాలుగు మార్కులను కలుపనున్నారు. కాగా, మార్కుల వెయిటేజీ కోసం ఫీల్డ్‌లో అనుభవం లేనివారు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు.
ల్యాబ్ అసిస్టెంట్ పరీక్ష రాసే అభ్యర్థులకు గతంలో ప్రైమరీ, అర్బన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు 104 వాహనాలు, ఎన్‌హెచ్‌ఎంలు, డీఎంహెచ్ఓ, జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పని చేసిన అనుభవం ఉంటే డీఎంఈ సూపరింటెండెంట్లు ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. కానీ 20 మార్కుల వెయిటేజీ కోసం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా విధులు నిర్వహించినట్లు కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఈ క్రమంలో సదరు ఏజెన్సీల మధ్యవర్తిత్వంతో లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తున్నది. గతంలో ఆయా సంస్థల్లో అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేసిన వారు సైతం ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం వేయిటేజీ మార్కులను పొందేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు సమాచారం. 2021లో కొవిడ్ సమయంలో అత్యవసర సేవల కోసం కంప్యూటర్ ఆపరేటర్లు, ల్యాబ్ అటెండర్లను అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకున్నారు. వారిలో కొందరు ఆసుపత్రిలో జాబ్ చేసుకుంటూ బయట పారామెడికల్ కళాశాలల్లో డీఎంఎల్టీ చేసి అక్కడ వేతనం తీసుకుంటూనే రెగ్యులర్ పరీక్షలు రాశారు. అలాంటి వారు కూడా అధికారుల నుంచి సర్వీస్ సర్టిఫికెట్లు పొందడం గమనార్హం. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోతే 15 నుంచి 20 ఏండ్లుగా ల్యాబ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ఒక ఎన్జీఓ సంస్థ రంగంలోకి దిగి సమాచార హక్కు చట్టం ప్రకారం ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.