కట్టంగూర్, జులై 01 : గ్రామాల్లో మురుగునీరు వీధుల్లో ప్రవహించకుండా ఏర్పాటు చేసే ఇంకుడు గుంతలను త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద డ్రైనేజీ సమీపంలో నిర్మించనున్న ఇంకుడు గుంత నిర్మాణ పనులకు మంగళవారం అధికారులతో కలిసి మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో 26 సోక్ పీట్స్ (ఇంకుడు గుంతలు) నిర్మించనున్నట్లు తెలిపారు.
డ్రైనేజీ నుండి వచ్చే మురుగునీరు ఇంకుడు గుంతల్లోకి చేరడంతో పారిశుధ్యం మెరుగుపడడంతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జానప్రకాశ్ రావు ఇన్చార్జి ఎంపీఓ చింతమల్ల చలపతి, ఏపీఓ కడెం రాంమోహన్, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, చిత్తలూరి జానకిరాములు, యర్కల సత్తయ్య పాల్గొన్నారు.