నల్లగొండ ప్రతినిధి, జూలై 17 (నమస్తే తెలంగాణ): నకిరేకల్ నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీ కాల్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పలుచోట్ల కాల్వలకు రెండు వైపులా ఉన్న భూములను కొందరు ఆక్రమిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాల్వల వెంట ఇరువైపులా ఉన్న దారులను సైతం పట్టాభూముల్లో కలిపేసుకుని అక్రమంగా సాగు చేస్తున్నారు. దీంతో కాల్వ వెంట కింద వరకు వెళ్లాల్సిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలోని ఎస్ఎల్బీసీ మైనర్ కాల్వను కబ్జా చేసి సాగు చేస్తున్న వైనం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించేందుకు 25 ఏళ్ల క్రితం సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇందులో భాగంగా పానగల్ ఉదయ సముద్రం నుంచి అయిటిపాముల మీదుగా మూసీ వరకు ప్రధాన కాల్వతో పాటు చెర్వులు, కుంటలు నింపేందుకు సబ్ కెనాల్స్ తవ్వారు. వాటి కోసం అప్పట్లోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలా పరిహారం పొందిన రైతుల్లో కొందరు తాజాగా కాల్వలను ధ్వంసం చేస్తూ, కాల్వ వెంట ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు.
ఈ కాల్వలకు ఇరువైపులా ఉన్న పలువురు ఇప్పటికే మెజార్టీ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, సేకరించిన ఈ భూమిపై వారికి ఎలాంటి హకులు ఉండవు. కానీ పాలెం నుంచి గుడివాడ చెరువుకు నీరును తీసుకెళ్లే డి-53 కాల్వకు ఇరువైపులా ఉన్న పలువురు రైతులు ఈ భూములను ఆక్రమించారు. ఎల్4 మైనర్ కాల్వ వెంట ఉన్న దారులను తమ పట్టా భూమిలో కలిపేసుకున్నారు. ఎప్పటికప్పుడు కాల్వల వెంట తిరుగుతూ ఆయా భూములను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆక్రమణదారులకు అడ్డే లేకుండా పోతోంది.
ఫిర్యాదుల వెల్లువ..
పాలెం పరిధిలో ఎల్ఎల్బీసీ కాల్వల ఆక్రమణపై చుట్టుపక్కల రైతులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. కాల్వ భూముల కబ్జాపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని, కాల్వ వెంట రైతుల రాకపోకలకు ఇబ్బందుల లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు చేపట్టిన విచారణలోనూ కాల్వ భూములు కబ్జాకు గురైనట్లు తేలింది. దీనిపై సంబంధిత ఏరియా ఇరిగేషన్ ఏఈఈ నివేదికను సిద్ధం చేస్తూ ఆక్రమణలను తొలగించి కాల్వ భూములను కాపాడాలని స్థానిక తాసీల్దార్కు నివేదించినట్లు తెలిసింది. దీని ఆధారంగా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాను తొలగించి కాల్వ భూములను ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నీళ్లు రాకుండా చేశారు : కృష్ణయ్య, రైతు
మా ఊరకుంట చెరువులోకి డి-53 కాల్వ నుంచి నీరు వచ్చి చేరుతుంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రస్తుతం ఈ కాల్వ పూర్తిగా ధ్వంసమైంది. కాల్వకు అటు, ఇటుగా ఉన్న రైతులు ఈ కాల్వను పూర్తిగా ధ్వంసం చేసి, భూములను ఆక్రమించారు. పాలెం నుంచి నోముల గ్రామం వెళ్లే మార్గంలో ముళ్ల కంచె వేశారు. పైభాగంలోని రైతులను అటు వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వెంటనే ఈ కాల్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. రైతుల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలి. ఆక్రమణ దారులపై కేసులు నమోదు చేయాలి. భవిష్యత్తులో మరొకరు ఈ భూములను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.