నల్లగొండ, ఆగస్టు 4 : నిరుద్యోగ యువతీ, యు వకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్లగొండలో నైపుణ్యాభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న పార్కులో ఆదివారం ఆయన న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌం డేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని, ప్రధానంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి స్వయంగా ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. చదువుకున్న యువ త ఏదో ఒక రంగంలో శిక్షణ తీసుకొని ఉపాధి మార్గాలను సంపాదించుకోవాలని చెప్పారు.
అంతకు ముందు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపించారు. అదే సమయం లో నల్లగొండ మండలం దుప్పలపల్లికి చెందిన స్వాతి గుండెజబ్బుతో బాధపడుతున్నానని, తనకు సాయం చేసి ఆపరేషన్ చేయించాలని మంత్రిని కోరగా ఆయన ఆస్పత్రి ఖర్చులు అన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే తన తల్లిదండ్రులు చనిపోవడంతో పదో తరగతి చదువడం ఇబ్బందిగా ఉందని మంత్రికి విన్నవించగా తాను చదివిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో న్యాక్ నల్లగొండ ఇన్చార్జి అశోక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.