యాదాద్రి భువనగిరి, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ వేసేది హ్యామ్ రోడ్లు కాదని, స్కాం రోడ్లని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. హ్యామ్ రోడ్ల పేరుతో సర్కారు పెద్దలు దోపిడీకి స్కెచ్ వేశారన్నారు. రూ.10ల పనిని రూ. 50కి అప్పగించి, కమీషన్ల పేరుతో సగం డబ్బులు దొబ్బి తింటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సొమ్మును దోచుకొని దాచుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సర్‌పై మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా మట్లాడారు.
బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక హ్యామ్ రోడ్ల పేరుతో జరుగుతున్న దోపిడీపై విచారణ జరిపిస్తామన్నారు. హ్యామ్ రోడ్ల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ బూత్‌లు పెట్టే ప్రమాదం ఉందన్నారు. 17న సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండలోని రహదారుల ప్రారంభోత్సవానికి వస్తున్నారని, ఆయన పర్యటనలతో ఉమ్మడి జిల్లాకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదని, జిల్లా మంత్రులు పదవులు అనుభవిస్తున్నారే తప్ప, అభివృద్ధిపై దృష్టి సారించడంలేదన్నారు. ఇద్దరు మంత్రులు పోటీపడి మరీ హెలికాప్టర్లు వాడుతున్నారని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు.

ఎన్నికలప్పుడే రైతు భరోసా..
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రధానంగా పోలీసు శాఖలో పెచ్చుమీరిపోతున్నదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు, చోరీలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల శాఖ చెప్పుచేతల్లో పోలీసు శాఖ పనిచేస్తున్నదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పత్తాలేకుండా పోయాయని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడే రైతు భరోసా విడుదల చేస్తున్నారని, మళ్లీ ఎలక్షన్లు వస్తే తప్ప పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదన్నారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పొత్తుతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి ఛాయలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని, కల్లాల్లో వడ్లు అలాగే ఉన్నాయని, తడిసి మొలకలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. మిల్లర్లను భయపెట్టి కోట్లు దోచుకుంటున్నారని, కొనుగోళ్లు దళారులకు వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడేండ్లలోనే వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని, కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర ఛాయలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘సర్’పై అలెర్ట్‌గా ఉండాలి
ఓటరు జాబితా సవరణ అనేది వడబోత కార్యక్రమమని, బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఓట్లు గల్లంతవుతాయని జగదీశ్ రెడ్డి సూచించారు. సర్‌లో మ్యాపింగ్ సమస్యలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ఆంధ్రా నుంచి అడ్డగోలుగా వలస వచ్చారన్నారు. సర్ వచ్చినా ఇంకా డ్యూయల్ ఓట్ల నమోదు ప్రమాదం పొంచి ఉందన్నారు. డ్యూయల్ ఓట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. బూత్ లెవర్ ఆఫీసర్‌తో పాటు బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు సైతం ఇంటింటికి వెళ్లాలని, అప్పుడే తప్పొప్పులు సవరణ చేసుకోవచ్చన్నారు. ఓటరు కార్డులో అక్షరం తప్పు ఉన్నా సరిదిద్దుకోవాలన్నారు. భువనగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సర్‌లో తప్పుల్లేకుండా చూసుకోవాలి.. పైళ్ల శేఖర్ రెడ్డి
సర్ ప్రక్రియలో తప్పుల్లేకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సూచించారు. బూత్ ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలని సూచించారు. త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు
సర్‌పై అవగాహన ఉండాలి.. చింతల ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకూ బీఎల్వో, సర్‌పై పూర్తి అవగాహన ఉండాలని పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సర్‌లో భాగంగా ఓట్ల గుర్తింపు బీఆర్ఎస్ నేతలకు పవిత్రమైన బాధ్యత అని అన్నారు. సర్‌లో ఏజెంట్లు పాల్గొనకపోతే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, ఓటరు జాబితాల్లో జరిగే చిన్న పొరపాట్లు కూడా ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తాయన్నారు.
బూత్ ఇన్చార్జీలు అప్రమత్తంగా ఉండాలి.. కంచర్ల
కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు చీల్చేందుకే సర్ పేరుతో కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బూత్ ఇన్చార్జీలు అలెర్ట్‌గా ఉండాలన్నారు. పార్టీ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ మాట్లాడుతూ పదవులు, ప్రభుత్వం రావాలంటే బీఆర్ఎస్ శ్రేణులు సమర్థంగా పని చేయాలన్నారు. ‘సర్’లో కార్యకర్తలు అలెర్ట్‌గా ఉండాలని, లేకుంటే ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, రాజ్యవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గాదె నరేందర్ రెడ్డి, ఎనబోయిన ఆంజనేయులు, బీరు మల్లయ్య పాల్గొన్నారు.