సూర్యాపేట టౌన్, జూలై 4: ‘విశాఖపట్నం అరకులో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిని పంచుకుంటుండగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 11.780 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నాం. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన పిట్టల నాగరాజు, ఆది వంశీ, విశ్వనాథుల సాయికుమార్, దోసపాటి వంశీ, సారగండ్ల శివకార్తీక్, ఆంగోతు వంశీ, దాసాయిగూడెం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి మధుసూదన్, సూర్యాపేట రాజీవ్‌నగర్‌కు చెందిన కూతురు ఆకాశ్, శూర శ్రవణ్‌కుమార్, గుండారపు శివతో కలిసి ఏపీలోని విశాఖపట్నం దగ్గర అరకు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గం జాయి కొనుగోలు చేసి ఐదు నుంచి పది గ్రాముల చొప్పున ఒక్కో పొట్లం తయారు చేసి రూ.500లకు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలో గంజాయి కొనుగోలు చేయడానికి నిందితులు రూ.30వేలు జమ చేసుకున్నారు. గంజాయి కొనుగో లు చేయడానికి జూ న్ 30న నాగరాజు, ఆది వంశీ బస్సు లో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లారు. అక్కడి నుంచి రైలులో అరకు వెళ్లారు. అక్కడ రూ.2 వేలకు కిలో చొప్పున 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఈనెల 3న సూర్యాపేటకు వచ్చారు. గంజాయిని నాగరాజు ఇంటిలో దాచిపెట్టారు.
అనంతరం నల్లచెరువు గుట్టపై గంజాయిని వాటాలు వేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీసీఎస్ పోలీసులు, సూర్యాపేట పట్టణ సీఐ వెంకట య్య, ఎస్ఐ ఏడుకొండలు సిబ్బందితో వారిపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నా రు. కేసులో బాగా పని చేసిన పోలీసులను ఎస్పీ నరసింహ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, మహేంద్రనాథ్, హరికృష్ణ, సీసీఎస్, పట్టణ పీఎస్ సిబ్బంది ఉన్నారు.