చందంపేట, నవంబర్ 5 : నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. జంతువుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నల్లమలలో మొక్కలను విపరీతంగా పెంచడంతోపాటు బయటి వ్యక్తులు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వన్య ప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు 110 సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారు. దప్పిక తీర్చుకునేందుకు వచ్చే జంతువులను గుర్తించేందుకు 120 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వారంలో ఒకసారి జంతువులను గుర్తించడంతో పాటు కొత్త జంతువులేవైనా అటవీలోకి ప్రవేశించాయా అనేది నిర్ధారించుకుంటున్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత పులులు 6, మనుబోతులు 118, పందులు, ముళ్ల పందులు, సాంబార్, నెమళ్లు, జింకలు 476 ఉన్నట్లు కంబాలపల్లి రేంజ్ ఆఫీసర్ భాస్కర్ తెలిపారు. అటవీ ప్రాంతంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులవలయం, గుంతలతండా, సర్కిల్తండా, చిత్రియాల, పెద్దమూల, రేకులగడ్డ, నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 45 చెక్ డ్యామ్లు, 16 మినీ చెక్ డ్యాములు నిర్మించి నీటిని నిల్వ చేయడంతో అటవీ జంతువుల దాహార్తిని తీర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. వన్య ప్రాణులకు ఎవరూ ఇబ్బంది కలిగించకుండా బీట్ ఆఫీసర్లు వాచ్ టవర్లపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. హరిత హారంలో నాటిన మొక్కలు పెరుగుడంతో నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంగా మారుతున్నది భాస్కర్ పేర్కొన్నారు.