నకిరేకల్, మార్చి 22 : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై అధికారులపై విచారణ కొనసాగుతుంది. జిల్లా అధికారులకు వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలు చేరడంతో డీఈఓ భిక్షపతి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, జిల్లా పరీక్షల విభాగం అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. కాగా మరోవైపు లీకేజీల వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకుని పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం రాత్రి నుండి విచారణ చేస్తున్నారు.
ఈ విషయంపై నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నకిరేకల్‌లో విచారణ నిర్వహిస్తున్నారు. లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్(సిఎస్) సి.గోపాల్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ (డీఓ) రామ్మోహన్ రెడ్డి కు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాన్ని బయటకు తెచ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎంఈఓ ఎం.నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక సమాచారం.