భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 6 : మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆన్లైన్లో పౌర సేవలు అందించడంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతూ, వ్యవసాయం, అనుబంధ ఆధారిత ప్రాంతమైన ఈ గ్రామంలో 580 కుటుంబాలు ఉన్నాయి. 2,063 మంది జనాభా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలతో అనుబంధాలతో మెలుగుతున్న శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ అన్ని పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందించడంతో జిల్లాలో ఆదర్శంగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (పరిపాలన సంసరణలు, ప్రజా ఫిర్యాదుల అమలు) డీఏఆర్ పీజీలో ఉత్తమ ర్యాంక్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆన్లైన్ ద్వారా పౌర సేవలు అందించడంతో పౌర సేవల అమలు తీరును పరిశీలించేందుకు త్వరలో ఉన్నతాధికారుల బృందం గ్రామపంచాయతీని సందర్శించనున్నది.
గ్రామ విశిష్టత
శివారెడ్డిగూడెం గ్రామంలో 80శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. కంప్యూటర్, డిజిటల్ పేమెంట్స్ సేవలు చెల్లించడంలో యువత ఆసక్తి చూపుతుంది. గ్రామంలో విరివిగా ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, రసాయన ఎరువులు వెదజల్లె డ్రోన్లతో యువత ఉపాధి పొందుతున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు.
చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి ఖాళీ ప్రదేశాల్లో, రోడ్ల వెంట విరివిగా మొకలు నాటారు. వీధులను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారు. ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులకు వైద్య చికిత్స అందించడం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి గ్రామపంచాయతీలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా అన్ని సేవలు
రాష్ట్ర రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీలో జననం, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ సర్టిఫికెట్లు, వృత్తి, వ్యాపార లైసెన్సుల జారీ, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ చెల్లింపులు, మ్యుటేషన్ సేవలు ఆన్లైన్లో అందిస్తున్నారు.
ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డుల జారీ, వేతనాల చెల్లింపులు, మస్టర్ నమోదు, తాగునీరు, శానిటేషన్, ఫిర్యాదులు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, గ్రామసభలో చర్చించే ఎజెండా అంశాలు, సంక్షేమ పథకాల అమలు, నిర్ణయ్ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు. గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలను ‘మేరీ’ యాప్లో స్వీకరిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం ఆస్తి పన్ను వసూలైన గ్రామపంచాయతీగా శివరెడ్డిగూడెం రికార్డుకెకింది. గడువు కంటే ముందుగానే గ్రామస్తులు పన్నులు చెల్లించారు.
ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం
ధాన్యం ఉత్పత్తిలో శివారెడ్డిగూడెం పది సంవత్సరాల నుంచి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2023లో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు దకించుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఏ సమస్య రాకుండా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. దాంతోపాటు పలు అవార్డులు దకాయి.
జాతీయ స్థాయికి ఎంపికవుతాం
గ్రామపంచాయతీలో ఆన్లైన్ ద్వారా పౌర సేవలు అందించడంపై శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలువడంతో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. అధికారుల పరిశీలన, స్రూట్నీ తర్వాత జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ సేవలను వీడియోగ్రఫీ కూడా చేశాం. చాలా బాగుంది. జాతీయ స్థాయికి వెళ్తామని నమ్మకం నాకుంది.
– గూడూరు రజిత, పంచాయతీ కార్యదర్శి, శివారెడ్డిగూడెం
రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది
ఆన్లైన్ ద్వారా పౌర సేవలు అందించడంలో శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు చేరువలో సత్వర సేవలు అందిస్తున్నారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్నారు. పచ్చని పైర్లతో గ్రామం కళకళలాడుతుంది.
– రాపర్తి భాసర్గౌడ్, ఎంపీడీఓ, భూదాన్ పోచంపల్లి మండలం