సూర్యాపేట టౌన్, మే 21 : సూర్యాపేట జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. సుమారు గంట పాటు వర్షం కురవడంతో రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. పలుచోట్ల పిడుగులు పడి గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. జిల్లా కేంద్రంలోని 8వ వార్డు సీతరాంపురానికి చెందిన మేడుదుల మల్లయ్యకు చెందిన గొర్రెలను నల్లచెరువు తండాలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో 10 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.
కోదాడ రూరల్: మండలంలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన బడుగుల లక్ష్మయ్య కుటుంబానికి మేకల పెంపకం జీవనాధారం. లక్ష్మయ్య ప్రతిరోజు గ్రామ శివారులో మేకలు మేపుతుంటాడు. రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో మేకలను కాసేందుకు గ్రామానికి చెందిన లింగయ్యను కూలి కింద పంపించాడు. లింగయ్య బుధవారం నల్లబండగూడెం గ్రామ శివారులోని మంగలితండా రోడ్డులోని రైస్ మిల్లు ఎదురుగా ఓ పొలంలో మేకలను మేపుతుండగా వర్షం రావడంతో మేకలు మొత్తం సమీపంలోని చెట్టు కిందకు చేరాయి. కాపరి లింగయ్య దూరంగా ఓ బండపై నిల్చొని ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పిడుగు పడటంతో చెట్టు కింద 36 మేకలు మృత్యువాత పడ్డాయి. చెట్టుకు దూరంగా ఉండటంతో లింగయ్యకు ప్రాణపాయం తప్పింది. ఈ ఏడాది మేకలను అమ్మి కుమార్తె వివాహం చేయాలనుకుంటున్న సమయంలో మేకలు మృత్యువాత పడటంతో లక్ష్మయ్య బోరున విలపించాడు. సెంటు భూమి కూడా లేని లక్ష్యయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, మండల పశువైద్యాధికారి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు.
పెన్పహాడ్: అకాల వర్షానికి అనంతారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం, 50 ధాన్యపు రాశులు తడిసిపోయాయి.
ఆత్మకూర్.ఎస్: మండలంలోని పలు గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో వడ్ల రాశులతో పాటు గోనె సంచుల్లో నింపిన ధాన్యం తడిసిపోయింది.
తుంగతుర్తి: మండల వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
బూరుగడ్డలో పిడుగుపాటు
హుజూర్నగర్ రూరల్: మండలంలోని బూరుగడ్డ గ్రామంలో మాడుగుల రాములమ్మ ఇంటి మెట్లపైన వాస్తు కోసం కట్టిన దిమ్మెపై పిడుగుపడి ధ్వంసమైంది. అదేవిధంగా ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి.
విద్యుత్ తీగలు తగిలి గేదెలు మృతి
మేళ్లచెర్వు: మండలంలోని రేవూరు శివారులో గాలికి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి.