 
                                                            నల్లగొండ ప్రతినిధి, జూన్ 17(నమస్తే తెలంగాణ) : మూడు రోజుల వ్యవధిలో నల్లగొండ జిల్లా పాలన రథసారథలిద్దరూ బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలోనే రావడం.. వచ్చిన ఆరు నెల్లలోపే బదిలీ కావడం విశేషం. ఈ నెల 15న కలెక్టర్ హరిచందన బదిలీ కాగా తాజాగా సోమవారం జిల్లా ఎస్పీ చందనా దీప్తికి కూడా స్థాన చలనం తప్పలేదు. చందనాదీప్తి స్థానంలో స్టేట్ నార్కోటిక్స్ విభాగం ఎస్పీగా పనిచేస్తున్న 2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ శరత్ చంద్ర పవార్‌ను జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. చందనా దీప్తికి రైల్వేస్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల తరువాత అప్పటివరకు ఉన్న జిల్లా పాలన యంత్రాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ చివరి వారంలో మార్చింది.
ఈ ఏడాది జనవరి 1న అపూర్వరావు స్థానంలో ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా 5 నెలల 17 రోజులకే బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ వ్యవధిలో బదిలీ అయిన ఎస్పీ చందనా దీప్తినే అవడం గమనార్హం. అటు బదిలీ అయిన కలెక్టర్ హరిచందన కూడా ఈ ఏడాది జనవరి 8న బాధ్యతలు చేపట్టారు. వీరు ఇరువురు వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత పట్టభద్రుల ఎన్నికల హడావుడే సరిపోయింది. ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎక్కువ ఎఫెర్ట్ పెట్టాల్సి వచ్చింది.
ఇక ఎన్నికలు ముగిశాయి కాబట్టి జిల్లా పాలనపై దృష్టి సారిస్తున్న సమయంలోనే ఊహించని విధంగా ఇద్దరినీ మూడు రోజుల తేడాతో ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో జిల్లా కలెక్టర్‌గా వచ్చిన సి. నారాయణరెడ్డి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. ఇక చందనాదీప్తి స్థానంలో ఎస్పీగా బదిలీపై వస్తున్న శరత్ చంద్ర పవార్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. మూడు రోజుల వ్యవధిలో జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్యలతో సంబంధం లేకుండానే పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నుల్లోనే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగినట్లు సమాచారం.
 
                            